Latest NewsStates

రాజకీయ రగడ – ముస్లిం మహిళల మారుతున్న జీవితాలు – 2

యుడిఎఫ్ పై మతపరమైన ఒత్తిడి

అబూ బకర్ వివాదం ప్రకటనను దాటి ఒక రాజకీయ ఘర్షణగా మారింది…

కాంతపురం వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌కు వ్యతిరేకంగా ‘సమస్త’లోని తీవ్రవాద వర్గం, ముస్లిం లీగ్‌లోని ఒక వర్గం రంగంలోకి దిగాయి. ఈ ప్రకటన ముస్లిం సంస్థలు, నాయకుల ప్రతిస్పందనలు కేరళలోని ముస్లిం మహిళల జీవితాలు, జీవన పరిస్థితులు, విద్యపై మరింత విస్తృతమైన చర్చకు దారితీశాయి.

సతీశన్ ప్రారంభంలో మౌనంగా ఉన్నప్పటికీ, తర్వాత క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంతపురంపై విమర్శలు గుప్పించారు. మహిళలు బయటకు రావడం వల్ల పెద్ద వినాశనం జరుగుతుందనే వాదన 19వ శతాబ్దానికి చెందినదని ఆయన అన్నారు.

మహమ్మద్ ప్రవక్త కాలంలో మహిళల చారిత్రక ప్రాధాన్యతను సతీశన్ ప్రస్తావిస్తూ.. ఆయన భార్యలు ఖదీజా, అయిషాలను ఉదాహరణగా చూపారు. ఖదీజా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని, ప్రారంభ ఇస్లాం సైనిక చరిత్రలో అయిషా ప్రముఖ పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు.

సమస్త, ముస్లిం లీగ్‌లలోని కొన్ని వర్గాలకు ఈ ప్రస్తావనలు ఆగ్రహం కలిగించాయి.

ఎమ్మెల్యే కె.పి. నౌషాద్ అలీ నేతృత్వంలో సమస్త నాయకుల బృందం ముఖ్యమంత్రిని కలవడానికి క్లిఫ్ హౌస్‌కు చేరుకుంది. సతీశన్ విలేకరుల సమావేశం వీడియోను, కాంతపురం వైఖరితో ఆయన విభేదించినట్లు తెలిపే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను తొలగించాలని సమస్త డిమాండ్ చేయగా, దాని యువజన విభాగం దీనిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగింది.

కేరళ ముస్లిం జమాత్ కూడా సతీశన్ తన ప్రకటనను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాంతపురంను విమర్శించడం ముఖ్యమంత్రి పదవికి తగినది కాదని వాదించింది. సతీశన్ ఇస్లామిక్ చరిత్ర, ఖురాన్, ప్రవక్త చరిత్రను అధ్యయనం చేయాలని కోరింది.

ఆ తర్వాత ఫేస్‌బుక్ నుండి ఆ పోస్ట్‌ను తొలగించారు. సమస్త, ముస్లిం లీగ్‌లలోని కొన్ని వర్గాల ఒత్తిడికి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సతీశన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు.

అయితే, కాంతపురంతో తన విభేదానికి కట్టుబడి ఉన్నానని సతీశన్ తర్వాత పునరుద్ఘాటించారు. సమస్త తనను విమర్శించడంపై తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, ఈ వివాదాన్ని తీర్పు చెప్పే స్వేచ్ఛ ప్రజలకే ఉందనేది ఆయన మాట.

ఈ రాజకీయ ఘర్షణ ఒక పెద్ద సామాజిక వాస్తవికత వైపు కూడా దృష్టి మళ్లించింది.

ఈ వివాదం తర్వాత జరిగిన చర్చలు, పరిశీలనలు ముస్లిం అమ్మాయిలలో చాలామంది మహిళలు ఇంట్లోనే అణగిమణగి ఉండాలనే వైఖరిని అంగీకరించడం లేదని చూపించాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఈ ప్రశ్న ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

జాతీయ స్థాయిలో, అనేక ఇతర దేశాలతో పోలిస్తే డిగ్రీ, పీజీ, ఉన్నత చదువులకు చేరుకుంటున్న ముస్లిం అమ్మాయిల నిష్పత్తి తక్కువగానే ఉంది. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలలో ఈ శాతం ఎక్కువగా ఉండగా, అమెరికాలో 42 శాతంగా ఉంది. అదే భారతదేశంలో ఇది 2 నుండి 5 శాతం మాత్రమేనని గణాంకాలు చెప్తున్నాయి.

కేరళలో పరిస్థితి ముఖ్యమైన అంశాలలో భిన్నంగా ఉంది.  గణాంకాల ప్రకారం 2022-23లో 16 శాతం మంది అబ్బాయిలతో పోలిస్తే 25 శాతం మంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం చేరారు. జాతీయ స్థాయిలో కూడా పీజీ, డాక్టరేట్లలో చేరే అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను మించిపోయింది. అబ్బాయిలు 108,526 మంది కాగా, అమ్మాయిలు 154,878 మంది ఉన్నారు.

1,400 సంవత్సరాల క్రితం అరేబియాలోని సామాజిక పరిస్థితుల్లో మహిళలు జీవించినట్లుగానే 21వ శతాబ్దపు భారతదేశంలోని మహిళలు కూడా జీవించాలని ఆశించడం ఆచరణాత్మకం కాదని నాదాపురం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లియాకత్ అలీ వాదించారు.

ఈ అంశానికి ఉపాధి మరొక కోణాన్ని అందిస్తుంది. కేరళలో 13.8 శాతం మంది ముస్లిం మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా, భారతదేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 1.8 శాతంగా ఉందనే గణాంకాలు చెపుతున్నాయి.

అదే సమయంలో, ఉద్యోగాల్లోకి వచ్చే ముస్లిం మహిళలపై కూడా మతపరమైన నిబంధనల పేరుతో క్రమశిక్షణ, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణించడంపై ఆంక్షలు, దుస్తులకు సంబంధించిన నిబంధనలు, బహిరంగ వేదికలపై మహిళలు కనిపించడాన్ని వ్యతిరేకించడం వంటివి ఇందులో ఉన్నాయి.

హిజాబ్, పర్దాలను తప్పనిసరి, మరింత విస్తృతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ముస్లిం సమాజం లోపలి నుంచే నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆస్తి, ఆరాధన, విద్య, ఉపాధికి సంబంధించిన హక్కులను డిమాండ్ చేయడానికి మహిళలు ముందుకు వస్తున్నారని ముస్లిం సమాజంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు చెపుతున్నాయి.

ఈ చర్చ ఒక మతపెద్ద ప్రకటనగా మాత్రమే పరిమితం కాలేదు. దానిని దాటి ముందుకు వెళ్ళింది. మహిళలు ఎంతవరకు చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా  ప్రయాణించాలి, ఏ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి,  సమాజంలో బహిరంగంగా ఎలా కనిపించాలి అనేది ఎవరు నిర్ణయించాలనే ప్రశ్నకు దారి తీసింది.

ఓణం సందర్భంగా ముస్లిం అమ్మాయిలు స్పందించిన తీరు ఈ చర్చలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సాంప్రదాయ కేరళ దుస్తులు, ముఖానికి స్కార్ఫ్‌లు ధరించిన అమ్మాయిలు ఓణం ఆటలు, నృత్యాలలో పాల్గొన్నారు.

సామాజిక పరిశీలకులు ఈ పరిణామాన్ని ఒక కొత్త “జాస్మిన్ రివ్యూల్యూషన్” (జాస్మిన్ విప్లవం) ప్రారంభంగా అభివర్ణిస్తున్నారు.

ఈ వివాదం సమాజంలో వస్తున్న ప్రధాన మార్పును సూచిస్తోంది – ముస్లిం మహిళలు కేవలం మత, రాజకీయ నాయకులు జరిపే చర్చల వస్తువులుగా మిగిలిపోకుండా, బహిరంగ సమాజంలో చురుకైన భాగస్వాములుగా మారుతున్నారు.

  • G.K. Suresh Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *



Select State

Telangana

Andhra Pradesh

Assam

Delhi

Manipur

Nagaland

Uttarakhand