Latest NewsPoliticsPopular NewsStateStates

రాజకీయ రగడ, ముస్లిం మహిళల మారుతున్న జీవితాలు – 3

ముస్లిం మహిళల స్వేచ్ఛను ఎవరు నిర్ణయిస్తారు?

ముస్లిం మహిళల స్వేచ్ఛపై జరుగుతున్న ఈ చర్చ కేవలం కేరళకే పరిమితం కాలేదు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఒక కొత్త ‘జాస్మిన్ రివల్యూషన్’ (జాస్మిన్ విప్లవం) ఆవిష్కృతమవుతోంది.  ముస్లిం మహిళలు హిజాబ్, పరదాలకు సంబంధించిన ఆంక్షలను సవాలు చేస్తూ తమ స్వేచ్ఛను, స్వయంప్రతిపత్తిని చాటుకుంటున్నారు.

కేరళలో మహిళా అక్షరాస్యత, విద్య అత్యధిక స్థాయిలో ఉన్నప్పటికీ, భారతదేశంలోనూ, కేరళలోనూ ముస్లిం మహిళలు ఇంకా ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ చేసిన ప్రకటనను ఏదో ఒక విడిగా వచ్చిన వ్యాఖ్యగా కాకుండా, ఈ కొనసాగుతున్న చర్చలో భాగంగానే చూడాలి.

భారతదేశం ఒక లౌకిక దేశమని, రాజ్యాంగం పౌరులకు తమ మతాన్ని విశ్వసించే, ప్రచారం చేసుకునే హక్కును కల్పిస్తుందని కాంతపురం వాదించారు. రాజ్యాంగం మతాచారాలపై విధించిన పరిమితులను, ఇటీవల న్యాయస్థానాలు చేసిన పరిశీలనలను గమనిస్తే ఆయన వాదన ఎంత తప్పో అర్ధం అవుతుంది.

షరియా చట్టం రాజ్యాంగానికంటే అతితమైనది కాదని, భారతీయ చట్టమే పౌరులకు చివరి చట్టపరమైన అధికారంగా ఉంటుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించాయి.

రాజ్యాంగం మహిళలకు, పురుషులకు సమానత్వాన్ని, సమాన అవకాశాలను ఇస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది: మతపరమైన వ్యాఖ్యానం ఆధారంగా రాజ్యాంగం మహిళలకు హామీ ఇచ్చిన హక్కులను నిరాకరించడానికి ఒక మత పెద్దకు ఏ అధికారం ఉంది?

పర్దాను వదిలిపెట్టి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అబాదీ బాను బేగం; ‘పూర్ణ స్వరాజ్’కు పిలుపునిచ్చిన ‘ఉర్దూ-యే-ముల్లా’ సంపాదకురాలు బేగం నిషాతున్నీసా మోహానీ; 1857 తిరుగుబాటు సమయంలో ఆయుధాలు పట్టిన యోధులకు నాయకత్వం వహించిన అష్ఘానీ బేగం; రాణి లక్ష్మీబాయికి బాడీగార్డ్‌గా సేవలు అందించిన మూన్ దార్; స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లిన బీబీ అమతుస్ సలామ్‌లను దృష్టిలో పెట్టుకుంటే అబూ బకర్ లేవనెత్తిన అంశాలకు  సమాధానం లభిస్తుంది. సామాజిక జీవితంలో ముస్లిం మహిళల భాగస్వామ్యం భారతీయ లేదా ముస్లిం చరిత్రకు కొత్తదేమీ కాదని మనకు అర్ధం అవుతుంది.

1990ల నుండి కేరళ అనుభవాలను పరిశీలిస్తే, ఈ కాలంలో కేరళలో పూర్తి శరీరాన్ని కప్పే పర్దా, బుర్కాలు ఎక్కువగా వ్యాప్తి చెందాయి. సిమి (SIMI) వంటి తీవ్రవాద సంస్థల ప్రభావమే ఈ మార్పుకు కారణం.

విద్య, స్వేచ్ఛ, మాడ్రన్ డ్రస్, ముస్లిం అమ్మాయిలకు సమాన అవకాశాల కోసం వాదించిన ‘ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ’ (MES) ప్రముఖ పాత్రనే పోషించింది. అటువంటి ప్రగతిశీల స్వరాలు ఆ తర్వాత తీవ్రవాద సంస్థల నుండి ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

మహిళల పాత్రపై ఆంక్షలను విధించడానికి అతివాద సాహిత్యాన్ని ప్రచురించడం తో పాటు మతపరమైన జోక్యం కూడా చేసుకున్నారు. మహిళలు స్వేచ్ఛగా బయటకు వెళ్లడం, నచ్చిన దుస్తులు ఎంచుకోవడం, ఒంటరిగా ప్రయాణించడం, చదువుకోవడం లేదా ఉద్యోగం చేయడాన్ని నిరుత్సాహపరచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని చూపించడానికి అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతను, మతపరమైన ఉద్రిక్తతలను

ప్రచారంలో వినియోగించుకున్నారు.

భారతదేశం వంటి దేశంలో, వేర్వేరు మతాల పట్ల గౌరవాన్ని కాపాడుకుంటూనే, ఏ మతపరమైన వ్యాఖ్యానం కూడా మరొక పౌరుడి రాజ్యాంగ హక్కులపై ఆంక్షగా మారకుండా నిరోధించడమే అసలైన సవాలు. మహిళా విద్యకు ఎదురైన వ్యతిరేకతను, కేరళలోని ముస్లిం మహిళలపై విధించిన ఆంక్షలను సునిశితంగా పరిశీలించవలసి ఉంటుంది.

ఈ ఆంక్షలను ఓణం పండుగ, ఎం.ఎస్. బాబురాజ్ సంగీత వారసత్వంతో సహా కేరళ యొక్క విస్తృత సాంస్కృతిక సంప్రదాయాలతో పోల్చవలసి ఉంది.

ఆ తర్వాత సరికొత్త ఓణం వచ్చింది.

మతపరమైన ఆజ్ఞలు ఉన్నప్పటికీ ముస్లిం అమ్మాయిలు ఓణం వేడుకల్లో పాల్గొన్నారు. వారు స్కార్ఫ్‌లతో కేరళ సాంప్రదాయ కసవు దుస్తులను ధరించారు, ఓణం పాటలు పాడారు, పూల రంగావల్లులు వేశారు, సద్య (విందు) తిన్నారు,  నృత్యాలు చేశారు. కాసరగోడ్ నుండి పరశ్శాల వరకు, వారు ఇతర వర్గాల సభ్యులతో కలిసి వేడుకలు చేసుకున్నారు.

ఈ భాగస్వామ్యం సోషల్ మీడియా ద్వారా వ్యాపించి, కేరళ సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో యువ ముస్లిం మహిళలు తమ స్థానాన్ని చాటుకోవడానికి ఒక స్పష్టమైన చిహ్నంగా మారింది.

కాంతపురం, జిఫ్రీ తంగల్‌లు మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని పిలుపు ఇచ్చినా, అమ్మాయిలు బహిరంగంగా దానిని  సవాలు చేశారు. నేటి సామాజిక పరిస్థితులు ప్రవక్త కాలం నాటి పరిస్థితుల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ, రవాణా, విద్య, ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం సమాజాన్ని మార్చివేసాయి.

‘ఒక అమ్మాయి చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం, ఆర్థికంగా స్వతంత్రంగా మారడంలో తప్పేముంది? ఒక మహిళ తన మతాన్ని ఆచరిస్తూనే పురుషుడితో సమానంగా రాజ్యాంగ స్వేచ్ఛను కోరుకోవడంలో తప్పేముంది? వివాహం, భరణం, ఆస్తి మరియు కుటుంబ జీవితంలోని ఇతర రంగాలలో మహిళలు సమానత్వాన్ని డిమాండ్ చేయడంలో తప్పేముంది?’ అనే ప్రశ్నలకు అబూ బకర్  ప్రసంగం సమాధానం ఇవ్వలేదు.

రాజ్యాంగం మహిళలకు హామీ ఇచ్చిన సమానత్వం వారికి లేదని ఏ మత పెద్దయినా ఒక లౌకిక ప్రజాస్వామ్యంలో  నిర్ణయించగలరా?

రాజ్యాంగం ఒక విస్తృతమైన అవకాశాలకు తలుపులు తెరిచినప్పుడు, తాము ఇంట్లోని నాలుగు గోడల మధ్యే ఉండాలా వద్దా అనేది ముస్లిం మహిళలే నిర్ణయించుకోవాలి. తమ స్వేచ్ఛను, తమ మార్గాన్ని నిర్ణయించుకోవాల్సింది వారే.

ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి అనుగుణంగా ఇస్లామిక్ మతపరమైన తీర్పులను మార్చడం లేదా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని కాంతపురం మరొక ప్రకటన విడుదల చేశారు.

కాంతపురంను సందర్శించిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయన వైఖరిని సమర్థించలేదు, మత పండితులు కొత్త వాస్తవాలను గుర్తించాలని అన్నారు.

ఈ వివాదం ఒక ప్రకటనకో లేదా ఒక సర్క్యులర్‌కో పరిమితం కాకుండా తన పరిధిని విస్తరించుకుంది. మతపరమైన వ్యాఖ్యానం, రాజ్యాంగ సమానత్వం, ముస్లిం మహిళలు తమ స్వంత జీవిత గమనాన్ని నిర్ణయించుకునే హక్కు వంటి అనేక అంశాలను ఇది లేవనెత్తింది.

(సమాప్తం).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *



Select State

Telangana

Andhra Pradesh

Assam

Delhi

Manipur

Nagaland

Uttarakhand